14, మే 2011, శనివారం

వేసవి శెలవలు

ఈ వేసవి శెలవలకి మా ఊరు వెళ్ళినపుడు అన్నయ్య వాళ్ళ అబ్బాయి సాయి గాడు బాబాయ్! ఈ శెలవల్లో ఏమి తోచటం లేదు ఏమి చెయ్యను బాబాయ్ అంటూంటే నేను ఇది వరకు ఏమి వెలగబెట్టే వాడినో ఆలోచిస్తే కొన్ని సీన్లు గుర్తొచ్చాయి.

పొద్దున్నే లేవటం. పొద్దున్నే అంటే మరీ పొద్దున్న అని పొరపాటు పడతారేమో. ఏ ఏడు ఏడున్నర ఆ ప్రాంతాల్లో. ఇంకా పడుకోవాలని ఉన్నా తలుపులు తీసేసి జనాలు తిరుగుతుంటే మెలుకువ వచ్చేసేది . స్నానం కానిచ్చి, అబ్బాయి గారి హోటల్ కి వెళ్లి ఒక పెసరట్టు, ఒక నాలుగు ఇడ్డెన్లు లాగించి వచ్చే దార్లో గాలి కబురులు చెప్పి ఇంటికి వచ్చే సరికి పదో పదకొండో అయ్యేది. పక్క భాను వల్లింట్లోంచో ప్రసాదు వాల్లింట్లోంచో తెచ్చిన నవల్లు, స్వాతి, ఆంధ్ర ప్రభ లాంటి విజ్ఞాన పత్రికలు చదివేసరికి ఇంకో గంట గడిచేది. ఈ లోగా తిన్న ఇడ్డెన్లు, పెసరట్టు హరించుకు పోతుండటం వల్ల సుష్టుగా భోజనం కానిచ్చైటం. సాయంత్రం నాలుగు అయితే కాని క్రికెట్ మొదలు పెట్టక పోవటం తో ఈ లోగా ఏమి చెయ్యాలన్నదే అస్సలు సమస్య.

ఆ రోజుల్లో మనకి చిరంజీవి అంటే కొంచం అభిమానం . అభిమానం అంటే మరీ మొదటి ఆట సినిమా కి వెళిపోవటం, సినిమా పోస్టర్స్ కి పాలాభిషేకం చెయ్యటం కాదు కాని, ఏదో కొద్దిగా అభిమానం. లేటెస్ట్ గా రిలీజ్ ఐన చిరంజీవి సినిమా పాటల కాసెట్స్ తెచ్చి ఆ పాటలు విని ఈ పాటకి చిరంజీవి గాడు ఎలా స్టెప్స్ వేసి ఉంటాడో అనుకుంటూ ఉండటం. ఉదాహరణకి "అందం హిందోళం అధరం తాంబూలం", "చక్కని చుక్కల మధ్యన బ్రేక్ డాన్సు" లాంటి పాట్లనమాట. అదో శునకానందం. ఆ పాటలు వింటూ ఇంట్లో వాళ్ళు ఎంత నరకం అనుభవించి ఉంటారో ఇప్పుడు అటువంటి పాటలు వింటుంటే అర్థమవుతోంది.

పనీ పాట లేక బేవార్స్ గా ఉండటం వల్లేమో అన్నం తిన్న రెండు గంటలకే మళ్ళీ ఆకలి మొదలు. ఎప్పుడూ చేసే ఉప్మా, పకోడీ కాకుండా ఏమైనా వెరైటీ గా చేస్తే బాగుండునని అనుకుంటుంటే, పాలకోవా తట్టింది. ఇంట్లో వాళ్ళని పాలకోవా చెయ్యమంటే వీడికి మెడ మెంటల్ బాగా ఎక్కువైంది అనుకుంటారని నేనే ట్రై చేద్దామని మొదలెట్టాను. స్టవ్ మీద పెద్ద గిన్నె లో పాలు పెట్టి, సిం లోంచి హై లోకి హై లోంచి సిం లో కి తిప్పుతూ గిన్నె నిండా పాలు పెట్టాం కదా, కనీసం గిన్నె సగానికైన పాలకోవా తయారవుతుందని ఊహించుకుంటూ అక్కడే కూచోవటం. అసలే నీళ్ళ పాలేమో అవి క్రమక్రమంగా గిన్నె అడుగుకి వెళ్లి పోతూనే ఉండేవి కాని గట్టి పడే సూచనలే లేవు. మధ్యలో అప్పుడప్పుడు చిరాకేసి, ఇది ఈ జన్మ కి ఇది అవదు అనుకుని ఆ కొద్దిగా చిక్కపడ్డ పాలని తాగేస్తే గొడవ వోదుల్తుంది అనిపించినా మల్లి ఆశ చావక తిప్పటం కొనసాగించే వాణ్ణి. ఓ గంటకో గంటన్నరకో సీను క్లైమాక్స్ కి వస్తున్నట్టని పించి, పంచదార వేసేసి గట్టిగా మనిషి ఊగిపోతూ తిప్పటం. మొదలెట్టినపుడు ఉన్న పెద్ద గిన్నెడు పాలూ చివరికి ఓ రెండు చెంచాలు పాలకోవా అయ్యేది. ఈ బంక గిన్నె, సగానికి పైగా ఖాళి అయిపోయిన గ్యాస్ సిలిందర్ చూసి మా అమ్మ ఈ వెధవకి మళ్ళీ పాలకోవా ఆలోచన రాకుండా చేయి భగవంతుడా అని ఎ వెంకన్నబాబుకో ఓ శనివారం ఉపవాసం మొక్కుకుని ఉంటుందని నా అనుమానం.

వేసవి కాలం మధ్యాహ్నాలు ఇంకో కాలక్షేప కార్యక్రమం VCR అద్దెకి తెచ్చి సినిమాలు వెయ్యటం. అలా వేసేటప్పుడు ఊళ్లోనే ఉన్నా మా ఇద్దరు అత్తయ్యలకి చెబితే వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు సినిమా చూడటానికి. అలా నేను తెచ్చిన కళా ఖండాల్లో ఒక సినిమా "అంతం". ఆ సినిమా ఆల్రెడీ ధియేటర్ లో చూసేసినా , ఇంకేమి తెలిసిన కొత్త సినిమాలు లేకపోవటం వల్ల అదే తేవలసి వచ్చింది. సెటప్ అంతా చేసిన తరువాత అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, అత్తయ్యలు కూచున్నారు చూడటానికి. గిన్నెలు తోమతనికి వచ్చిన మా పనిమనిషి కూడా సినిమా చూసే గిన్నెలు కడుగు తానని సినిమా కి కూచుంది. ఈ సినిమా నిండా హత్యలే. ఇంచుమించు ఒకరో ఇద్దరో మినహా సినిమాలో అంతా చస్తారు, హీరో తో సహా. మొదలైన పావు గంట కి మా అమ్మ, అతయ్యలు, వదిన పెరటి కటకటాల్లోకి, నాన్న, అన్నయ్య వీధి లోకి వెళ్ళిపోయారు. ఇంకో ఐదు నిమిషాలు చూసి పనిమనిషి కూడా గిన్నెలు తోమతనికని లేచింది. తెచ్చిన నేను కూడా చూడకపోతే, పరువు పోతుందని ఒక్కన్నే కూచుని పూర్తి చేసానని పించాను. వెడుతూ వెడుతూ మా అత్తయ్యలు "దిక్కుమాలిని సినిమా ఒకటి తెచ్చావ్. మధ్యాహ్నం నిద్ర కూడా పోయింది అనవసరం గా" అని సణుక్కుంటూ నెమ్మదిగా బయల్దేరారు.

ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో నెమ్మదిగా సాయంత్రం నాలుగు అయ్యేది. క్రికెట్ మొదలు. నాలుగింటికి వెళ్ళటం మళ్ళీ ఏ ఏడు గంటలకో రావటం. అస్సలే అర్భకంగా ఉండటం ఇంతసేపు ఎండలో ఆడటం తో ఇంటికి వచ్చేసరికి కాళ్ళు లాగటం మొదలెట్టేవి. సావిట్లో కూచుని కొబ్బరి నూనె రాసుకుంటే "ఆ వెధవ క్రికెట్ ఆడటం ఎందుకు, ఇలా కొబ్బరి నూనె పట్టించటం ఎందుకు" అంటారని, నెమ్మదిగా ఎవరూ చూడకుండా ఆ కొబ్బరి నూనె సీసా పుచ్చుకుని వీధి గది లోకి వెళ్ళడం. ఒక రోజు కొబ్బరి నూనె రాసుకుంటుంటే ఎవరయితే చూడకూడదో వాడే చూసాడు. "మా అన్నయ్య". చూసి "ఏరా నువ్వే రాసుకున్తున్నావే. కొబ్బరి నూనె సీసా పుచుకుని సుబ్బయ్య వాళ్ళింటికి వెళ్ళాల్సింది. వాడు రాసేవాడు" అన్నాడు. వాడు అలా అనేసరికి నాకు పుండు మీద కారం చల్లటం అంటే ఏమిటో అర్ధమయ్యింది. ఇంతకీ సుబ్బయ్య అంటే మా క్రికెట్ టీం కెప్టెన్ అన్నమాట. అందరి కంటే ముందే క్రికెట్ కిట్ గ్రౌండ్ కి మోసుకేల్లడం , పక్క ఊళ్ళ టీం లతో మాకు మ్యాచ్ లు కుదర్చటం వీడి ముఖ్య విధుల్లో కొన్ని.

రాత్రి భోజనం అయ్యాక చుక్కలు చుక్కలు గా వచ్చే టీవీ లో దూరదర్శన్ ప్రోగ్రామ్లు కాసేపు తిట్టుకుంటూ చూసి పడుకోవటం. (అప్పటికి మా ఊళ్ళో టీవీ రిసెప్షన్ సరిగ్గా లేక క్లియర్ గా వచ్చేవి కాదు అండ్ కేబుల్ టీవీ అప్పటికి ఇంకా రాలేదు) ఇదీ మన కార్యాక్రమం.

7 కామెంట్‌లు:

  1. challaa baggaa raasav babai
    neelo intha manchi kavithaa hrudayam vundani ippativarakoo naake teliyadu

    రిప్లయితొలగించండి
  2. flashback ni latest ga colortv lo choopinchav mamaiah..
    1) వెడుతూ వెడుతూ మా అత్తయ్యలు "దిక్కుమాలిని సినిమా ఒకటి తెచ్చావ్. మధ్యాహ్నం నిద్ర కూడా పోయింది అనవసరం గా" అని సణుక్కుంటూ నెమ్మదిగా బయల్దేరారు.

    2) "ఏరా నువ్వే రాసుకున్తున్నావే. కొబ్బరి నూనె సీసా పుచుకుని సుబ్బయ్య వాళ్ళింటికి వెళ్ళాల్సింది. వాడు రాసేవాడు" అన్నాడు

    Highlight dialogues!!! kallaku kattinattu cheppav

    రిప్లయితొలగించండి
  3. మురళిగారు.. బ్లాగ్ ప్రపంచానికి స్వాగతం. బాగున్నాయి మురళి గారు వేసవి శలవుల్లో మీ పాత జ్ఞాపకాలు.. నిజం చెప్పాలంటే రాజభోగం అనే అనాలి దాన్ని.

    మీరు అబ్బాయిలు కాబట్టి అలా నడిచింది.. మాకు అయితే ఇంటి పని ఇంకెప్పుడు నేర్చుకుంటావు అంటూ చదువుకుంటున్నప్పుడే పనులు చెబుతూ ఉండేవారు. ఇక వేసవి శలవులు వస్తే, అవి మాకు వచ్చాయో లేక ఇంట్లో వాళ్ళకి వచ్చాయో తెలిసేది కాదు. పొద్దున్నే ఇల్లు తుడవడం దగ్గర నించి మొదలుకుని, కూరలు తరగడం, భోజనాలయ్యాక ఎంగిళ్ళేత్తడం, మధ్యాహ్నం దీపానికి వత్తులు చెయ్యడం, మళ్ళీ సాయంకాలం గుమ్మాలు కడిగి, ముగ్గులు వేసి, రాత్రి మళ్ళీ ఎంగిళ్ళేత్తి, పక్కలు వేసేవరకు అలా చెబుతూనే ఉండేవారు. దేముడా.. ఈ వేసవి శలవులు ఎవడు కనిపెట్టాడు.. వాడెవడో తప్పకుండా స్త్రీద్వేషి అయి ఉంటాడు. ఈసారి వాడు కనపడితే వాడి మాడు బద్దలుకొట్టాలి అనుకుంటూ మళ్ళీ పనులు చెయ్యడం లో మునిగిపోయేవాళ్ళం. కొబ్బరి నూనె రాసుకునే తీరిక కూడా ఉండేది కాదు.

    కానీ.. ఇప్పుడు అది అంతా తలుచుకుంటే నవ్వొస్తుంది. ఏమైనా.. అవి మరపురాని, మధురమైన పాత రోజులు. ఎన్ని పనులు చెప్పినా, మధ్యలో 'సరేలే.. ఈపని నేను చేస్తాను.. నువ్వు వెళ్ళు' అంటూ మాచేతిలో పని లాక్కునేవారు. అప్పుడు ఎందుకు ఇన్ని పనులు చెబుతున్నారా అని అనుకునేవాళ్ళం గానీ.. ఆ పనులు నేర్పించకపోతే పెళ్ళి అయి పెద్దవాళ్ళకి దూరంగా వచ్చేశాక ఏపనీ తెలియక ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో. పెద్దవాళ్ళు అన్నీ ఆలోచించే చేస్తారు అని తరువాత తెలుస్తుంది.

    ఏది ఏమైనా మంచి పోస్ట్ రాశారు. మధ్యలో బోలెడు సార్లు నవ్వుకున్నాను.

    "ఓ గంటకో గంటన్నరకో సీను క్లైమాక్స్ కి వస్తున్నట్టని పించి, పంచదార వేసేసి గట్టిగా మనిషి ఊగిపోతూ తిప్పటం" సీన్ ఊహించుకుని పడీ పడీ నవ్వాను.

    మీ నించి ఇలాంటి పోస్ట్ లు మళ్ళీ మళ్ళీ రావాలి.

    రిప్లయితొలగించండి
  4. నాకైతే "బంక గిన్నె" కళ్ళముందు కదిలింది :). మీ ఊరు, కటకటాల ఇళ్ళు కాస్తో కూస్తో తెలియడం వల్ల చదవడమే కాకుండా మీ కధనం 'చూసాను' కూడా.

    రిప్లయితొలగించండి
  5. Murali, Chaala baga raasav. Subbayya dialogue was ultimate.

    Summer holidays lo manam chese inkopani cheruvulo eethalu.

    Memu chaala sepu cheda yeethalu kottesunte, maa chelli vachedi pilot siren vesukuni, annayya nuvvu intiki vastaava, leka ammani cheruvudaggariki rammannava ani amma adamandi antoo. That statement is final call annamaata, vellakapoyamo veepu cheeripoyedi....

    Golden days....
    Bobby

    రిప్లయితొలగించండి
  6. thanks Sastry..

    Bobby, avunu. cherlo eethalu - unforgettable. also if u remember, we used to play cricket matches between ur team & our team 7th vs. 8th etc, we did it upto 10th :)

    రిప్లయితొలగించండి