21, జూన్ 2011, మంగళవారం

Modati cinemaa

ఆ రోజు అవతారానికి చెప్పలేనంత ఆనందంగా ఉంది.  పిల్లి మొగ్గలు వెయ్యాలని, చెట్టు కొమ్మలు పట్టుకు కోతిలా ఊగాలని అనిపిస్తోంది.  అప్పుడప్పుడు తనలో తనే నవ్వేసుకుంట్టున్నాడు  . లేకపోతే, భాగ్యనగరం శివార్లలో ఎక్కడో ఉన్న తన తాతల నాటి మూడు ఎకరాల పొలం రింగు రోడ్డు పుణ్యమాని ఆరు కోట్లకి అమ్ముడు పోవటం ఏమిటి? తను ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయిపోవటం ఏమిటి? కొన్నాళ్ళు ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేసాక ఇప్పుడు ఈ డబ్బులతో ఎం చెయ్యాలన్న మీమాంస మొదలైంది. హితులు, సన్నిహితులు "సినిమా తియ్యి, ఏ రామానాయుడు లాగో ఐపోతావ్" అని ఎత్తేయ్యటం తో సినిమా తియ్యల్సిన్దేనని డిసైడ్ అయ్యాడు అవతారం. 

తన దగ్గర డబ్బులు ఉన్నాయనీ, సినిమా తియ్యలనుకున్ట్టున్నాననీ తెలియటం తో ప్రతీ వాడు వచ్చి తన దగ్గర కథ ఉందని చెప్పటం మొదలెట్టారు. ఈ దిక్కుమాలిని కథలన్నీ వినేసరికి అవతారం బుర్ర తిరగటం, వాంతులు అవటం లాంటివన్నీ పట్టుకున్నాయి.  ఇలా ఒక పదిహేను కథలు విన్న తరువాత, ఒక వర్ధమాన దర్శకుడు చెప్పిన కథ కొంచెం  బెటర్ గా ఉండటం తో ఓకే అన్నాడు. తన దగ్గర ఉన్న డబ్బులకి సరితూగేలా ఒక చిన్న హీరో ని, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అందర్నీ కుదిర్చాడు. హీరోయిన్ దగ్గరే వచ్చింది చిక్కు. డైరెక్టర్ బొంబాయి హీరోయిన్ ఉండాల్సిన్దేనంటాడు. వాళ్ళ రేట్ కి తగ్గ డబ్బులు లేవాయే.  ఆ ఎవరైతే ఏమిటి,  పొట్టి డ్రెస్సులు వేసుకుని కుప్పి గెంతులు వెయ్యటమే కదా అని అవతారం వాదన.  ఇంతలో డైరెక్టర్ యే ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చాడు. ఒక తెలుగామ్మయినే తీసుకుని పేరు నార్త్ ఇండియన్ పేరులా మార్చేదామన్నాడు.  అంతగా ఎవరైనా అడిగితే, తెలుగామ్మఎనని బొంబాయి లో సెటిల్ అయిందని చెప్పోచ్చోన్నాడు. అలాగే ఓ పిల్లని సెలెక్ట్ చేసి "మంగాభట్" అని నామకరణం చేసారు. ఈ సెలక్షన్ వ్యవహారాలూ, తనకి వస్తున్న importance అవతారానికి చాలా exciting గా ఉంది. అతనికి ఇంకా తెలీదు, అసలు కథ ముందుందని. 

ఇంతలో మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం కొడైకెనాలు వెళ్దామని, అక్కడైతే తనకి రాగాలు తరంగాల్లా తన్నుకోచ్చేస్తాయన్నాడు.  ఏ రోజా నో గీతాంజలి లెవెల్లో రావాలంటే అక్కడికి వెళ్ళాలి సిన్దేనని పట్టుపట్టటం తో తప్పలేదు. అవతారం, మ్యూజిక్ డైరెక్టరు, డైరెక్టరు అక్కడ ఐదు నక్షత్రాల హోటలు బస బిల్లుకి అవతారంకి గుండె గుభేలుమంది. ఇంతా చేసి మన మ్యూజిక్ డైరెక్టరు ఒక నాలుగు సిడి ల్లోంచి కిచిడీ చేసి ఒక ఆరు  పాటలు సృష్టించాడు. ఇక షూటింగ్ మొదలైన తరువాత హీరోయిన్ బ్యూటీ సెలూన్ కి, వాళ్ళ అమ్మ ఇతర షోకులు లాంటి చిన్న చితక ఖర్చులు అవతారం మెడకే చుట్టుకోవటం తో ఉన్న డబ్బు కాస్తా కర్పూరం లా హరించుకు పోవటం మొదలైంది.  దైరేక్టరేమో అందరూ ఆస్ట్రేలియా లో నో హాంగ్ కాంగ్ లోను పాటలు తీస్తున్నారు, మనం వెరైటీ గా పాకిస్తాన్ లో తీద్దాం అన్నాడు. "నీ పిచ్చి మండిపోనూ. నిన్ను ఏ పిచ్చి కుక్కో కరిచుంటుంది." అనుకుని వాదించినా లాభం లేక పోవటం తో ఒక పాట కోసం పాకిస్తాన్ కూడా వేల్లోచ్చారు.  ఇలా ముక్కుతూ మూలుగుతూ షూటింగ్ ఐన్దనిపించి, సినిమా కి 'దరిద్రుడు' అని పేరు ఫిక్స్ చేసారు. ఏ ఇడియట్ అని, బద్మాష్ అని సినిమా పేర్లు పెట్టలేదా, ఇది అచ్చ తెలుగు లో చక్కని టైటిల్. 

ఆ రోజు సినిమా రిలీజ్ ఫంక్షను.  డైరెక్టరు మాట్లాడుతూ "ఇటు వంటి కథతో ఇప్పటి దాకా ప్రపంచం లో ఎక్కడా సినిమా రాలేదని, ఇది అన్ని రికార్డుల్ని బద్దలకొట్టేస్తుందని" ధీమా గా చెప్పాడు. హీరోఇన్ను మంగా భట్   "ఇటువంటి నిర్మాత, డైరెక్టరూ దొరకటం తన అదృష్టమని, అవతారం సారు ఋణం ఈ జన్మలో తీర్చుకోలేనని" వచ్చీ రాని ఇంగ్లీష్ లో ముద్దు ముద్దు గా చెప్పింది. హీరో "ఈ సినిమా కోసం మిగతా హీరోల కంటా ఇంకో రెండాకులు ఎక్కువ చదివి తను టెన్ ప్యాక్ పెంచానని, చూస్తే అదిరిపోతారని" సెలవిచ్చాడు. 

ఓ నాలుగు రోజుల తరువాత సినిమా ప్రివ్యూ ఏర్పాటు చేసారు. అవతారం సకుటుంబం గా ఎనభయ్యేళ్ల తన బామ్మ తో సహా హాజరయ్యాడు. ఇక సినిమా కథలోకి వెళితే - హీరో రోడ్డు పక్కన ఖాళీ సీసాలు, పడేసిన ప్లాస్టిక్ సామానులు లాంటివి ఏరుకున్తుంటాడు. హీరోఇన్ను కోటీశ్వరుడి ఒక్కగానొక్క కూతురు. హీరో అడుక్కు తింటున్నా రాత్రి అయ్యేసరికి కతిలాంటి డ్రెస్సులు వేసుకుని పబ్బులకి డిస్కో తెక్కులకి వేల్లిపోతూంటాడు. శీతాకాలం వణికిపోతూ ఐస్ క్రీం తినటం, వేసవి కాలం మిట్టమధ్యాహ్నం స్వెట్టర్ వేసుకోవటం లాంటివి చేస్తూ, "ఎండలో ఐస్ క్రీం ఎవడైనా తింటాడని ఇలా తినటమే గొప్పని" లెక్చేర్లిచే హీరో, వర్షం వస్తూంటే తను ఎక్కడ ఉన్నానో కూడా మర్చిపోయి, రెండు చేతులు బార చాపి ఆకాశం లోకి చూస్తూ గిర్రని తిరిగే హీరోఇన్ను ఒకరినొకరు పిచ్చ పిచ్చగా ప్రేమించేసుకుంటారు. హీరోఇన్ను తండ్రి తెచ్చే బ్రహ్మాండమైన సంబంధాలని కాదని హీరో నే పెళ్లి చేసుకుంటానని భీష్మిన్చుకుంటుంది. దాంతో తిక్క రేగిన తండ్రి, ఒక పెళ్లి సంబంధం కుదిర్చి ఇంకో వారం లో పెళ్లి అని తేల్చేస్తాడు. ఆ పెళ్లి ఆపటానికి వచ్చిన హీరోని ఫైటింగ్ లో విలన్ (పెళ్ళికొడుకు తండ్రి) దుంగ లాంటి కర్రతో డిప్ప మీద ఒకటి పీకుతాడు. దాంతో హీరో కి తన గతం గుర్తొస్తుంది. ఫ్లాష్ బాక్ లో హీరో చాలా స్ట్రిక్ట్ పోలీసు ఆఫీసరు. ఇదే పెళ్ళికొడుకు తండ్రి ఒక పెద్ద మాఫియా డాన్.  అప్పుడు జరిగిన ఫైటింగ్ లో వెనక నుంచి మన హీరో తల మీద కొట్టటం తో అతనికి మతి పోయి, గతం అంతా మర్చిపోతాడు. ఇప్పుడు అది అంతా హీరోకి గుర్తొస్తుంది. హీరో ని గుర్తు పట్టిన విలను అతని మీదకి తోమ్బలా ఓ వంద మంది గూండాలని పంపటం, వాళ్ళు హీరోని చితగ్గోట్టేసి కదలటానికి కూడా లేకుండా పడేస్తారు. అప్పటి దాకా ఏడుస్తూ గింజుకుంటున్న హీరోఇన్ను ఉన్నట్టుండి దేవుడిని తిడుతూ పాట లంకిన్చుకుంటుంది. పాట అయ్యేసరికి, హీరూ లేవటం గూన్దాల్నందర్నీ చితకేసేసి, విలన్ తలమీద కొట్టటం తో ఈ సారి విలన్ కి మతి పోతుంది. కథ సుఖాంతమౌతుంది.

ప్రివ్యూ థియేటరు నుంచి వచ్చిన కొంతమంది జుట్టు పీకేసుకున్నట్టు గుర్తుగా జుట్టు నిటారుగా లేచి ఉంది, కొంత మంది పిచ్చి పిచ్చి గా గాల్లోకి చూస్తూ బైటకు వెళ్ళిపోయారు. అవతారం బామ్మకి లో బీపీ వచ్చేయటం తో డాక్టరు దగ్గరకు మోసుకుపోయారు. ఇలాంటి సినిమాలు అలవాటైన కొంతమంది సినీ పక్షులు మాత్రం అవతారం దగ్గరకి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి జాలిగా చూస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

రిలీజ్ ఐన ఒక నెల దాకా అవతారం ఇల్లు కదిలితే వొట్టు, ఎక్కడ జనం పట్టుకుని చితక్కోట్టేస్తారని. అప్పనం గా వచ్చిన డబ్బు అలాగే పోయిందని సరిపెట్టుకుని, ఇంకెప్పుడు సినిమా జోలికి పోనని వోట్టేసుకున్నాడు అవతారం. 


14, మే 2011, శనివారం

వేసవి శెలవలు

ఈ వేసవి శెలవలకి మా ఊరు వెళ్ళినపుడు అన్నయ్య వాళ్ళ అబ్బాయి సాయి గాడు బాబాయ్! ఈ శెలవల్లో ఏమి తోచటం లేదు ఏమి చెయ్యను బాబాయ్ అంటూంటే నేను ఇది వరకు ఏమి వెలగబెట్టే వాడినో ఆలోచిస్తే కొన్ని సీన్లు గుర్తొచ్చాయి.

పొద్దున్నే లేవటం. పొద్దున్నే అంటే మరీ పొద్దున్న అని పొరపాటు పడతారేమో. ఏ ఏడు ఏడున్నర ఆ ప్రాంతాల్లో. ఇంకా పడుకోవాలని ఉన్నా తలుపులు తీసేసి జనాలు తిరుగుతుంటే మెలుకువ వచ్చేసేది . స్నానం కానిచ్చి, అబ్బాయి గారి హోటల్ కి వెళ్లి ఒక పెసరట్టు, ఒక నాలుగు ఇడ్డెన్లు లాగించి వచ్చే దార్లో గాలి కబురులు చెప్పి ఇంటికి వచ్చే సరికి పదో పదకొండో అయ్యేది. పక్క భాను వల్లింట్లోంచో ప్రసాదు వాల్లింట్లోంచో తెచ్చిన నవల్లు, స్వాతి, ఆంధ్ర ప్రభ లాంటి విజ్ఞాన పత్రికలు చదివేసరికి ఇంకో గంట గడిచేది. ఈ లోగా తిన్న ఇడ్డెన్లు, పెసరట్టు హరించుకు పోతుండటం వల్ల సుష్టుగా భోజనం కానిచ్చైటం. సాయంత్రం నాలుగు అయితే కాని క్రికెట్ మొదలు పెట్టక పోవటం తో ఈ లోగా ఏమి చెయ్యాలన్నదే అస్సలు సమస్య.

ఆ రోజుల్లో మనకి చిరంజీవి అంటే కొంచం అభిమానం . అభిమానం అంటే మరీ మొదటి ఆట సినిమా కి వెళిపోవటం, సినిమా పోస్టర్స్ కి పాలాభిషేకం చెయ్యటం కాదు కాని, ఏదో కొద్దిగా అభిమానం. లేటెస్ట్ గా రిలీజ్ ఐన చిరంజీవి సినిమా పాటల కాసెట్స్ తెచ్చి ఆ పాటలు విని ఈ పాటకి చిరంజీవి గాడు ఎలా స్టెప్స్ వేసి ఉంటాడో అనుకుంటూ ఉండటం. ఉదాహరణకి "అందం హిందోళం అధరం తాంబూలం", "చక్కని చుక్కల మధ్యన బ్రేక్ డాన్సు" లాంటి పాట్లనమాట. అదో శునకానందం. ఆ పాటలు వింటూ ఇంట్లో వాళ్ళు ఎంత నరకం అనుభవించి ఉంటారో ఇప్పుడు అటువంటి పాటలు వింటుంటే అర్థమవుతోంది.

పనీ పాట లేక బేవార్స్ గా ఉండటం వల్లేమో అన్నం తిన్న రెండు గంటలకే మళ్ళీ ఆకలి మొదలు. ఎప్పుడూ చేసే ఉప్మా, పకోడీ కాకుండా ఏమైనా వెరైటీ గా చేస్తే బాగుండునని అనుకుంటుంటే, పాలకోవా తట్టింది. ఇంట్లో వాళ్ళని పాలకోవా చెయ్యమంటే వీడికి మెడ మెంటల్ బాగా ఎక్కువైంది అనుకుంటారని నేనే ట్రై చేద్దామని మొదలెట్టాను. స్టవ్ మీద పెద్ద గిన్నె లో పాలు పెట్టి, సిం లోంచి హై లోకి హై లోంచి సిం లో కి తిప్పుతూ గిన్నె నిండా పాలు పెట్టాం కదా, కనీసం గిన్నె సగానికైన పాలకోవా తయారవుతుందని ఊహించుకుంటూ అక్కడే కూచోవటం. అసలే నీళ్ళ పాలేమో అవి క్రమక్రమంగా గిన్నె అడుగుకి వెళ్లి పోతూనే ఉండేవి కాని గట్టి పడే సూచనలే లేవు. మధ్యలో అప్పుడప్పుడు చిరాకేసి, ఇది ఈ జన్మ కి ఇది అవదు అనుకుని ఆ కొద్దిగా చిక్కపడ్డ పాలని తాగేస్తే గొడవ వోదుల్తుంది అనిపించినా మల్లి ఆశ చావక తిప్పటం కొనసాగించే వాణ్ణి. ఓ గంటకో గంటన్నరకో సీను క్లైమాక్స్ కి వస్తున్నట్టని పించి, పంచదార వేసేసి గట్టిగా మనిషి ఊగిపోతూ తిప్పటం. మొదలెట్టినపుడు ఉన్న పెద్ద గిన్నెడు పాలూ చివరికి ఓ రెండు చెంచాలు పాలకోవా అయ్యేది. ఈ బంక గిన్నె, సగానికి పైగా ఖాళి అయిపోయిన గ్యాస్ సిలిందర్ చూసి మా అమ్మ ఈ వెధవకి మళ్ళీ పాలకోవా ఆలోచన రాకుండా చేయి భగవంతుడా అని ఎ వెంకన్నబాబుకో ఓ శనివారం ఉపవాసం మొక్కుకుని ఉంటుందని నా అనుమానం.

వేసవి కాలం మధ్యాహ్నాలు ఇంకో కాలక్షేప కార్యక్రమం VCR అద్దెకి తెచ్చి సినిమాలు వెయ్యటం. అలా వేసేటప్పుడు ఊళ్లోనే ఉన్నా మా ఇద్దరు అత్తయ్యలకి చెబితే వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు సినిమా చూడటానికి. అలా నేను తెచ్చిన కళా ఖండాల్లో ఒక సినిమా "అంతం". ఆ సినిమా ఆల్రెడీ ధియేటర్ లో చూసేసినా , ఇంకేమి తెలిసిన కొత్త సినిమాలు లేకపోవటం వల్ల అదే తేవలసి వచ్చింది. సెటప్ అంతా చేసిన తరువాత అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, అత్తయ్యలు కూచున్నారు చూడటానికి. గిన్నెలు తోమతనికి వచ్చిన మా పనిమనిషి కూడా సినిమా చూసే గిన్నెలు కడుగు తానని సినిమా కి కూచుంది. ఈ సినిమా నిండా హత్యలే. ఇంచుమించు ఒకరో ఇద్దరో మినహా సినిమాలో అంతా చస్తారు, హీరో తో సహా. మొదలైన పావు గంట కి మా అమ్మ, అతయ్యలు, వదిన పెరటి కటకటాల్లోకి, నాన్న, అన్నయ్య వీధి లోకి వెళ్ళిపోయారు. ఇంకో ఐదు నిమిషాలు చూసి పనిమనిషి కూడా గిన్నెలు తోమతనికని లేచింది. తెచ్చిన నేను కూడా చూడకపోతే, పరువు పోతుందని ఒక్కన్నే కూచుని పూర్తి చేసానని పించాను. వెడుతూ వెడుతూ మా అత్తయ్యలు "దిక్కుమాలిని సినిమా ఒకటి తెచ్చావ్. మధ్యాహ్నం నిద్ర కూడా పోయింది అనవసరం గా" అని సణుక్కుంటూ నెమ్మదిగా బయల్దేరారు.

ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో నెమ్మదిగా సాయంత్రం నాలుగు అయ్యేది. క్రికెట్ మొదలు. నాలుగింటికి వెళ్ళటం మళ్ళీ ఏ ఏడు గంటలకో రావటం. అస్సలే అర్భకంగా ఉండటం ఇంతసేపు ఎండలో ఆడటం తో ఇంటికి వచ్చేసరికి కాళ్ళు లాగటం మొదలెట్టేవి. సావిట్లో కూచుని కొబ్బరి నూనె రాసుకుంటే "ఆ వెధవ క్రికెట్ ఆడటం ఎందుకు, ఇలా కొబ్బరి నూనె పట్టించటం ఎందుకు" అంటారని, నెమ్మదిగా ఎవరూ చూడకుండా ఆ కొబ్బరి నూనె సీసా పుచ్చుకుని వీధి గది లోకి వెళ్ళడం. ఒక రోజు కొబ్బరి నూనె రాసుకుంటుంటే ఎవరయితే చూడకూడదో వాడే చూసాడు. "మా అన్నయ్య". చూసి "ఏరా నువ్వే రాసుకున్తున్నావే. కొబ్బరి నూనె సీసా పుచుకుని సుబ్బయ్య వాళ్ళింటికి వెళ్ళాల్సింది. వాడు రాసేవాడు" అన్నాడు. వాడు అలా అనేసరికి నాకు పుండు మీద కారం చల్లటం అంటే ఏమిటో అర్ధమయ్యింది. ఇంతకీ సుబ్బయ్య అంటే మా క్రికెట్ టీం కెప్టెన్ అన్నమాట. అందరి కంటే ముందే క్రికెట్ కిట్ గ్రౌండ్ కి మోసుకేల్లడం , పక్క ఊళ్ళ టీం లతో మాకు మ్యాచ్ లు కుదర్చటం వీడి ముఖ్య విధుల్లో కొన్ని.

రాత్రి భోజనం అయ్యాక చుక్కలు చుక్కలు గా వచ్చే టీవీ లో దూరదర్శన్ ప్రోగ్రామ్లు కాసేపు తిట్టుకుంటూ చూసి పడుకోవటం. (అప్పటికి మా ఊళ్ళో టీవీ రిసెప్షన్ సరిగ్గా లేక క్లియర్ గా వచ్చేవి కాదు అండ్ కేబుల్ టీవీ అప్పటికి ఇంకా రాలేదు) ఇదీ మన కార్యాక్రమం.