20, అక్టోబర్ 2015, మంగళవారం

Madhyahnam Aakali

మధ్యాహ్నం ఒంటిగంటన్నర అయింది .  ఆదివారం .  పన్నెండింటికి భోజనం లాగించేశాను. ఇంక ఇప్పుడు పెద్దగా  ఏమి చెయ్యాలో తోచటం లెదు.  ఎండ మండిపోతోంది.  కనీసం నాలుగున్నర అయితే కాని వికెట్లు పాతి క్రికెట్ మొదలెట్టం.  ఈ లోగా ఏమి చెయ్యాలన్నదే సమస్య.  ఇంచుమించు ప్రతీ ఆదివారం మధ్యాహ్నం సమస్య.

మా అమ్మ అప్పుడే వంటింట్లో అన్నీ సద్దుకుని సావిట్లోకి వచ్చింది. కాసేపు సావట్లో నడుం వాలుద్దామని.  మళ్ళీ ఇంకో గంట అయితే మధ్యాహ్నం కాఫీలు ఆ తరువాత రాత్రికి వంట preparations ఉంటాయి.    నేను సావట్లో రబ్బరు బాలు తో బౌలింగ్ ప్రాక్టీసు చేస్తున్నాను.  అలా చేస్తుంటే నే అంతకుముందు రెండు సార్లు మా అలమారు గాజు తలుపు బద్దలయిపోయింది.  మా నాన్న, అన్నయ్య నా కేసి పిచ్చ   కోపంగా  చూడటం, నేను నన్ను కానట్టు అటూ ఇటూ గాల్లోకి చూడటం, మా అమ్మ గాజు ముక్కలు ఎత్తి పారెయ్యటం, మా అన్నయ్య ఆ తరువాత రెండ్రోజుల్లో వడ్రంగా డిని తీసుకొచ్చి మళ్ళీ కొత్త అద్దం వేయించటం జరిగిపోయాయి రెండు సార్లూను.  సరే ఓ పావుగంట బౌలింగ్ ప్రాక్టీసు చేసినతరువాత అదీ బోరు కొట్టేసింది.

నెమ్మదిగా మా అమ్మ దగ్గరకెళ్ళి "అమ్మా, ఆకేలేస్తోందే" అన్నాను.
మా అమ్మ "అదేమిట్రా అన్నం తిని చెయ్యి కడుక్కుని గంట కూడా అవలేదు. అప్పుడే ఆకలా" అంది.
"అవునే. ఆకలేస్తోంది. ఏదైనా చెయ్యి తింటానికి " అన్నాను.
"వెధవాని.  నీకు ఆకలి కాదు.  అలా అనిపిస్తోందంతే, ఏమి తోచక.  నీది నిజం ఆకలి కాదు" అంది.

"చాల్లే. ఆకల్లొ  మళ్ళీ నిజం ఆకలి అబద్ధం ఆకలి అని ఉండవు.  నాకు ఆకలేస్తోందంతే" అన్నాను.
మా అమ్మ అటు తిరిగి పడుకుంది.
రెండు నిమిషాలాగి మా అమ్మ జబ్బ మీద నెమ్మదిగా తట్టి "ఆకలే" అన్నాను పొట్ట తడుముకుంటూ.
మా అమ్మ ఇంక  వీడు వదలడని decide అయి "సర్లే ఓ గంటాగు.  ఏదోటి చేస్తాను.  ఇప్పుడేగా అవన్నీ తోముకుని వచ్చాను." అని "సర్లే ఈ లోగా  మొన్న బొడ్డు వారు పంచిపెట్టినవి ఆ దేవుడి గది చిన్న అలమారలో ఉన్నాయి. తిను " అంది.

ఊళ్ళో ఎవరి అమ్మాయో, కోడలో పురిటికి వస్తే నో, వెళితేనో, ఊళ్ళో పంచిపెట్టినవి.  చనివిడి , చిమ్మిలి, చక్కిలాలు etc.   అందులో ఉండే తీపిగా లేని పదార్ధాలు, అంటే చక్కిలాలు , జంతికలు లాంటివి ఇచ్చిన వెంటనే నోట్లోకి వెళ్ళిపోతాయి. కొంచెం హై క్లాసు తీపి పదార్ధాలు అంటే లడ్డు, సున్నుండ లాంటివి కూడా వెంటనే అయిపోతాయి.
 ఇక మిగిలేవి చనివిడి, పంచదార చిలక లాంటివి.

పంచిపెట్టిన రోజునో, ఆ మర్నాడో పంచదార చిలక ముక్కు, కాళ్ళు ఇంట్లో ఎవరోకరు విరుచుకు తినేస్తారు.  ఇక మిగిలేది ఆ మొండెం.  అది ఆ డబ్బాలో పడుంటుంది.  దానికి చీమలు పడుతూంటాయి.  మా అమ్మ దులిపి మళ్ళీ లోపలేడుతూంటుంది.  పడేయ్యరు.  దులపటం, లోపలెట్టటం. దులపటం లోపలెట్టటం. అదో cycle.  కొన్నాళ్ళకి ఆ పంచాదార చిలక నిండా కన్నాలే కన్నాలు.  ఒక చెట్టుని కొస్తే, దాని లోపల చక్రాలని బట్టి చెట్టు  వయసుఎలా చెప్పచ్చో, పంచదార చిలక కున్న కన్నాలని పట్టి ఇంచుమించు అది ఎన్ని రోజుల క్రితందో  చెప్పచ్చు.

తెలిసినా, ఆశ  చావక వెళ్లి అలమారు తలుపు తెరిచాను.  ఇలా పంచి పెట్టినవన్నీ మా అమ్మ ఒక స్టీలు డబ్బాలో వేస్తుంది.  మూత తీసి చూశాను.  చిన్న చనివిడి ముద్ద మిగిలిపోయిన మిఠాయి పంచదార పొడికి అతుక్కు పోయి, ఎక్కడో డబ్బా అడుగున బిక్కు బిక్కు మంటూ ఉంది.  దానికే అతుక్కుని ముక్కు లేని పంచదార చిలక మొండెం.   ఆకలి గా ఉన్నప్పుడు ఈ చనివిళ్ళు, చిలకలు లాంటివి తినటం మన వాళ్ళ అయ్యే పని కాదు.  ఏ ఉప్మా నో పకోడీలో అయితే అదో దారి.

ఈ పురుళ్ళు పుణ్యాలకి ఇచ్చేవి  సివిల్ కేసులైతే, ఇంకొక రకం క్రిమినల్ కేసులవి.  అంటే మా తాతయ్య, నాయనమ్మల తద్దినాలకి అరిసెలు చేసినప్పుడు, ఆ మిగిలినవి ఇంకో డబ్బా లోకి చేరేవి.  తద్దినమయిన ఇంచుమించు నెల దాకా ఎప్పుడు ఆకలన్నా, "ఆ అరిసెలు తినరా, చక్కగా ఉన్నాయి" అంటూంటారు.  అవి ఓ రెండ్రోజులు బాగానే ఉంటాయి.  ఆ తరవాతే గట్టిగా ఐపోయి, పొడి రాలిపోతూ, తడిప్పెట్టిన రంపంపోట్టు పాకం పట్టి చేశారా అనిపించేలా తయారవుతాయి.  మొదటి రెండు రోజులు మీద సినిమా తెర మీద హీరోఇన్ను మొహంలా నిగనిగ లాడిన అరిసెలు, ఆ తరువాత మేకప్ లేకుండా రోడ్డు మీద యధాలాపంగా కనిపించిన  హీరోయిన్ మొహం లా వెలవెల పోతాయి.   వాటిని అలా తినాలంటే కష్టం, చాలా కష్టం. వాటిని చూస్తేనే ఆకలి తగ్గిపోయి, కడుపు నిండిపోతుంది మహాప్రభో.

అసలే ఆకలి లో రకాలు, మళ్ళీ అందులో లెవెల్సు  ఉంటాయి మరి.  ఉదాహరణకి

అటుకులు/ఆవకాయ ఆకలి
ఉప్మా ఆకలి
పకోడీ ఆకలి etc.

వాటి లెవెల్సు కూడా అదే ఆర్డర్ లో ఉంటాయి.  ఉదాహరణకి, ఉప్మా ఆకలి వేసినప్పుడు అటుకులు/ఆవకాయ తింటే ఆకలి పెద్దగా తీరదు.  తుత్తి గా అనిపించదు.  అలాగే పకోడీ ఆకలి వేసినప్పుడు ఉప్మా తిన్నా అంతే.  వీటి అన్నిటిని మించింది మిరపకాయ బజ్జి ఆకలి. అది వేసినప్పుడు రోడ్డు మీదకి వెళ్లి, అవి తిని వచ్చే దాక చాలా వెలితిగా ఉంటుంది.  ఈ థియరీ  అంతా ఇంట్లో వాళ్లకి అర్థమయ్యేలా చెప్పటం చాలా కష్టం.

ఇంతకీ చెప్పోచ్చేదేమిటంటే, కనీసం ఉప్మా లెవెల్ ఆకలేస్తుంటే, ఈ చనివిళ్ళు, పంచదార చిలక ముక్కలు తినటం మన వల్ల అయ్యే పని కాదు.  తింటే ఆకలికే అన్యాయం చేసినట్టువతుంది.  మహాపచారం.  అందుకని, అలా బైటకెళ్ళి కాసేపు తిరిగొస్తే, మా అమ్మ చెప్పినట్టు ఇది ఏమి తోచక వచ్చే ఆకలి అయితే, తగ్గాలి కదా.   సైకిల్ వేసుకుని బయల్దేరాను.  మా చిన్నత్తయ్య వాళ్ళ మొగలో ఎవరొకరు ఉంటారు. అక్కడికి వెళ్లి, కాసేపు కూర్చుని వద్దామని.

వెళ్తుంటే, రామం బాబయ్య (పిన్నింటి రామం గారు) వాళ్ళ ఇంటి గోడ మీద సినిమా వాల్ పోస్టర్ అతికిస్తున్నాడు, థియేటర్ వాడు.  ముంగండ లో ప్రతీ వారం సినిమా మారుతుంది.  సినిమా వాల్ పోస్టర్ అతికించే చోట్లలో రామం బాబయ్య వాళ్ళ గోడ ఒకటి.  సినిమా థియేటర్ వాడు పోస్టర్లు తీసుకొచ్చి, మైదాపిండి తో అతికిస్తాడు.  ముంగండ థియేటర్ లోకి కొత్త రిలీజ్ సినిమాలు కాదు కదా కనీసం ఒక మోస్తరు అంటే మూడు నాలుగేళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాలు కూడా రావు.  ఎప్పటివో BC సినిమాలు తెస్తాడు.  అయినా సినిమా మారే ప్రతి సారి, ఈ సారైనా ఏ చిరంజీవి గాడి సినిమా ఐనా తెస్తాడేమో అని ఆశ.  సైకిల్ మీంచి దిగి, ఏ సినిమా నా అని టెన్షన్ గా నిలబడ్డాను.  వాడు పోస్టరు తిరగేసి మైదా పిండి రుద్దుతున్నాడు, అతికించటానికి.  వాడినే ఏ సినిమా బాబూ అని అడిగితే చెబుతాడు.  కాని వాడు మైదా పిండి రాసే దాకా ఆగి, ఆ టెన్షన్ తో అతికించిన తరువాత చూస్తే అదో ఆనందం. శునకానందం.  సరే వాడు తిప్పి అతికిన్చేడు.  సినిమా "పొట్టేలు పున్నమ్మ".   "ఛీ దీనెమ్మ, ఇదీ మనం చూసే సినిమా కాదు" అనుకుని సైకిల్ ఎక్కి మొగ కేసి బయల్దేరాను.

అక్కడ అప్పటికే 6, 7 గురు ఉన్నారు.  ఊళ్ళో రెండు క్రికెట్ టీములు.  ఒకటి పెద్దాళ్ళది. ఇంకోటి చిన్నాళ్ళది.  టెన్త్ అయితే పెద్దాళ్ళ టీం లోకి ఎంట్రీ.   దానికి ఇంకో రెండేళ్ళు ఆగాలి మనం.  వెళ్ళేసరికి, అక్కడ   నిన్ననే అయిన ఇండియా, ఆస్ట్రేలియా one day మ్యాచ్ మీద చర్చ జరుగుతోంది.  ఇండియా ఓడిపోవటం తో ఇండియా టీం ని ఏకి పడేస్తున్నారు.

"ఈ మ్యాచ్ కూడా క్షవరం"
"ఈ సారి కూడా మంజ్రేకర్ గాదు ముందుకొచ్చి మరీ గోకాడ్రా. స్లిప్పులో పట్టేశారు".  గోకటం అంటే బాట్ తో బాల్ ని edge చెయ్యడం అనమాట.
"టెండూల్కర్ గాడు  ఆ బాల్ కి బాక్ ఫుట్ వెళ్ళకూడదేహ.  ముందుకొచ్చి లేపేస్తే,సిక్సు వెళ్ళిపోయేది."
"నేనే  కెప్టెన్ అయితే, జడేజా గాడిని 3rd down పంపేసే వాడిని ఆ situation లో.  అలా పంపకపోవటం కూడా దేబ్బెసేసింది."

"ఎప్పటిలాగే మన బౌలింగు దరిద్రమే.  శ్రీనాథ్ గాడిని కూడా చితకేస్సారు  నిన్న."
"ఎన్నైనా చెప్పు బాబాయ్. మనవాళ్ళు తద్దినం భోజనాలకి తప్పించి ఎందుకూ పనికిరారు. దరిద్రప్పీనుగులు. "

ఇలా రకరకాల వ్యాఖ్యానాలతో ఇండియా టీం ని ఉతికారేసి, వాళ్ళ ప్లేస్ లో మనం ఉంటె ఎలా ఆడేవాళ్ళమో ఊహించేసుకుని, ఇక తిట్టటానికి ఏమి మిగలని స్టేజి లో "ఆది వారం కదరా ఈవాళ పెంద్రాడే మొదలెట్టేద్దాం. 15 ఓవర్స్ మ్యాచ్ వేసేయ్యచ్చు" అంటూ అంతా బయల్దేరారు.  నేనూ సైకిలెక్కాను.
హై స్కూల్ గ్రౌండ్ కి మా ఇంటి మీంచే వెళ్ళాలి. వెళ్తుంటే, అరుగు మీద నుంచుని మా అమ్మ "ఒరేయ్, ఉప్మా చేశాను. తినేసి వెళ్ళు." అని కేకేసింది.
"వచ్చి తింటాను లేవే" అని క్రికెట్టు కి పరిగెట్టాను, సైకిల్ ఇంటి మెట్లకి జారేసి.

ఇప్పుడు ఆకలి వెయ్యటం లేదు (అనిపించటం లేదు ).  మా అమ్మ చెప్పింది రైటే.  అది ఉత్తిత్తి ఆకలి.  తోచక వేసే ఆకలి.
,